బెంగళూరు, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటక బీజేపీ సర్కారు అవినీతికి వ్యతిరేకంగా ‘పే సీఎవ్ు’ ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా సాగుతుండగా సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కొందరు పాత్రికేయులకు ముడుపులు చెల్లించారనే ఆరోపణలు రాష్ట్రమంతటా దుమారం రేపాయి. బొమ్మైపై చర్యలు తీసుకోవాలని సీనియర్ పాత్రికేయుడు, సామాజిక కార్యకర్త రాజారాం తళ్లూరు.. లోకాయుక్త, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ‘ఎంపిక చేసిన పాత్రికేయులకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రూ.2.5 లక్షలు ఇచ్చినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలి. నగదు మూలాలను తనిఖీ చేయాలి. కానుక రూపంలో నగదు చెల్లించిన బొమ్మైకి వ్యతిరేకంగా అవినీతి నిరోధక చట్టం కింద కేసు దాఖలు చేసి విచారణ జరిపి శిక్షించాలి. దీపావళి కానుకలతోపాటు నగదు కూడా చెల్లించినట్టు తేలితే ఎన్నికల ముందు అవినీతిగా పరిగణించాలి’ అని ఫేస్బుక్ ద్వారా లోకాయుక్త, ఎన్నికల సంఘానికి విన్నవించారు.
ఇదీ జరిగింది..
దీపావళి సందర్భంగా ఏటా ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఎంపిక చేసిన పాత్రికేయులకు కానుకలు, మిఠాయిలు పంపటం ఆనవాయితీ. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కొందరు మంత్రులు.. పాత్రికేయులు, సంపాదకులకు కానుకలు పంపారు. అయితే, దీపావళి కానుకగా బొమ్మై కొందరు పాత్రికేయులకు మిఠాయిలతోపాటు రూ.రెండున్నర లక్షల నగదు ఇచ్చారని శుక్రవారం ఒక వెబ్సైట్ ప్రచురించింది. దీనిపై ఒక ప్రముఖ దినపత్రిక విలేకరి స్పందించారు.‘డబ్బు పంపింది నిజం. అయితే, నగదు ఎంతో తెలియదు. డబ్బును చూసిన వెంటనే వాపసు పంపాను.’ అని తెలిపారు.