Karnataka | విజయపుర : భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కర్నాటకలో ఓ మెడికల్ కాలేజీ విద్యార్థి సోషల్ మీడియాలో పాకిస్తాన్ అనుకూలంగా పోస్ట్ చేసిందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ సోషల్ మీడియా పోస్టుపై హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దాంతో పోలీసులు బీఎన్ఎస్ 152తో పాటు 197(3)(5) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు. సదరు విద్యార్థి ముంబయిలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సదరు విద్యార్థిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. విద్యార్థి సోషల్ మీడియా పోస్ట్ వైరల్ కావడంతో హిందూ సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దాంతో విజయపుర పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయ్పురలోని అల్ అమీన్ మెడికల్ కాలేజీ విద్యార్థి తసౌద్ ఫరూకీ షేక్ అనే విద్యార్థి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
ఉద్రిక్తతల నేపథ్యంలో ‘నా పాకిస్తానీ స్నేహితులకు.. భారత్ ఆక్రమిత కశ్మీర్, ఆజాద్ కశ్మీర్ ప్రజలు సైనిక, ప్రభుత్వ స్థావరాలకు దగ్గరగా వెళ్లొద్దు. మీరు 200 కిలోమీటర్ల సరిహద్దుకు దగ్గరగా నివసిస్తుంటే దూరంగా వెళ్లిపోయండి. అల్లా మనందరినీ భారత్ నుంచి రక్షించుగాక. అమీన్’ అంటూ పాకిస్తాన్ జెండాను షేర్ చేసింది. ఆమె వాట్సాప్ స్టేటస్లోనూ ఇదే తరహాలో స్టేటస్ పెట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో సదరు విద్యార్థి క్షమాపణలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ‘తన చర్యల కారణంగా బాధపడిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. తాను భారతీయురాలినని.. నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. ఇది నా మాతృ భూమి. నేను భారత్లోనే పుట్టాను. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవివేకం. మళ్లీ ఇలాంటి పనులు చేయను. అందరినీ క్షమాపణలు కోరుతున్నా. జై హింద్’ అంటూ పోస్ట్ పెట్టిందని పోలీసులు వివరించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.