Karnataka : కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. కారులో ఒక మహిళను కత్తితో పొడిచిన ఒక యువకుడు.. అనంతరం అదే కారులో నాటు బాంబు పేలి సజీవదహనమయ్యాడు. బాధిత యువతి, కారు డ్రైవర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో శనివారం జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగేంద్ర (30) అనే వ్యక్తి బెంగళూరులో శనివారం ఒక కారు బుక్ చేసుకున్నాడు. అనంతరం తన సన్నిహితురాలైన రమ్యా ఉల్లాస్ (23)ను కారులో ఎక్కించుకున్నాడు.
రమ్య స్వస్థలం ఉత్తర కర్ణాటక జిల్లా. ఆమె బెంగళూరులోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పని చేస్తోంది. నాగేంద్ర, రమ్య ఉల్లాస్ కలిసి కారులో అంకోలా వెళ్తున్నారు. కారు వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరి మధ్యా కొంత దూరం వెళ్లిన తర్వాత వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో తుమకూరు జిల్లా సమీపంలోకి చేరుకోగానే రమ్యపై నాగేంద్ర కత్తితో దాడి చేశాడు. ఇదే సమయంలో ఒక నాటు బాంబుతో కూడా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో రమ్య.. వెంటనే డ్రైవర్ ప్రవీణ్‌కు విషయం చెప్పి, అప్రమత్తం చేసింది. అతడు తనపై దాడి చేశాడని, నాగేంద్ర వద్ద బాంబు కూడా ఉందని చెప్పింది. అప్పుడే ఆమె కారులోంచి బయటకు కూడా దూకేసింది. డ్రైవర్ కూడా వెంటనే కారును ఆపి పక్కకు దిగిపోయాడు. వెంటనే నాగేంద్ర కార్ డోర్ లాక్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు తీసుకొచ్చిన నాటు బాంబు ప్రమాదవశాత్తు పేలిందో లేక అతడే పేల్చుకున్నాడో ఇంకా తెలియదు కానీ.. ఆ బాంబు పేలి మంటలు చెలరేగాయి. కారుకు మంటలు అంటుకున్నాయి. నాగేంద్ర అందులోనే సజీవ దహనమయ్యాడు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. నాగేంద్ర మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కారు పేలిన ఘటనలో డ్రైవర్ ప్రవీణ్‌కు కూడా గాయాలయ్యాయి. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించిన అధికారులు చికిత్స అందిస్తున్నారు. కత్తిపోటు గాయాలైన రమ్యను కూడా తుమకూరు జిల్లా ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. తుమకూరు జిల్లా ఎస్పీ కూడా ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలతోపాటు నాటు బాంబు ఎలా వచ్చింది అనే దానిపై విచారణ జరుపుతామన్నారు.