Karnataka : పాలనకు, పౌర సేవలకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా సమస్యల్ని త్వరగా పరిష్కరించేందుకు ‘ప్రజా సేవ విభాగాన్ని’ ప్రారంభించింది. ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి ఈ విభాగం కృషి చేస్తుంది. ఈ విభాగానికి ఒక మంత్రి నాయకత్వం వహిస్తారని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిబ్బంది సహకారం అందిస్తారని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు వేగంగా స్పందించి, సమస్యల్ని పరిష్కరిస్తారన్నారు. ‘ప్రజా సేవా విభాగం’తోపాటు ‘ప్రజా సేవ అభియాన (పీఎస్ఏ)’ అనే మరో కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు సీఎం చెప్పారు.
దీనిద్వారా మంత్రులు ప్రతి నెలా జిల్లాలకు వెళ్లి, స్థానిక ప్రజలతో మాట్లాడతారని, అక్కడి సమస్యలు విని పరిష్కరిస్తారని సీఎం డీకే శివకుమార్ తెలిపారు. క్యాబినెట్ సమావేశం అనంతరం సీఎం ఈ విషయాల్ని వెల్లడించారు. ప్రజల విజ్ఞాపనల్ని పరిష్కరించేందుకే ఈ విభాగాల్ని ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా ఈ విభాగంలో ఫిర్యాదు చేస్తే, సంబంధింత విభాగానికి వాటిని బదిలీ చేస్తామని, అక్కడి అధికారులు వాటిని పరిష్కరిస్తారని సీఎం వివరించారు. ఈ విభాగానికి ఒక ఐఏఎస్ అధికారి సెక్రెటరీగా ఉంటారని, ఇతర అధికారులను కూడా నియమించి ప్రజల ఫిర్యాదులపై నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ప్రజల ఫిర్యాదుల్ని అవసరమైతే అధికారులతోపాటు సంబంధిత మంత్రులు, జిల్లా ఇంఛార్జ్ మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు పరిశీలిస్తారని చెప్పారు.
ఈ మొత్తం వ్యవహారం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఇక.. ప్రజా సేవ అభియానాలో భాగంగా జిల్లా ఇంఛార్జ్ మంత్రులు ప్రతినెలా మొదటి, మూడవ శనివారం తమ పరిధిలోని వివిధ నియోజకవర్గాలలో పర్యటిస్తారు. ఒకవేళ ఆ రోజు ప్రభుత్వ సెలవు దినం అయితే.. ముందు రోజే మంత్రులు పర్యటిస్తారు. స్థానికంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరిస్తారు. ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేర్చేందుకే ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని డీకే శివకుమార్ వివరించారు.