బెంగళూరు: తన కొత్త చిత్రం థగ్ లైఫ్ని కర్ణాటకలోప్రస్తుతానికి విడుదల చేయకూడదని నటుడు కమల్ హాసన్ నిర్ణయించుకున్నట్లు ఆయన తరఫు న్యాయవాది మంగళవారం కర్ణాటక హైకోర్టుకు తెలియచేశారు. కాగా, ఈ ప్రకటన రావడానికి ముందు కన్నడ భాష పుట్టుకపై కమల్ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టిందని కమల్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ప్రశ్నించింది. ఏ ఆధారాలతో మీరు ఆ వ్యాఖ్యలు చేశారని కమల్ని నిలదీసిన హైకోర్టు మీరేమైనా చరిత్రకారులా? భాషావేత్తలా? అని ప్రశ్నించింది. కమల్ వ్యాఖ్యలు కర్ణాటక ప్రజల మనోభావాలను గాయపరిచాయని పేర్కొన్న జస్టిస్ ఎం నాగప్రసన్న.. కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పడానికి ఎందుకు నిరాకరిస్తున్నారని కమల్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు.
భాష అన్నది ప్రజల భావోద్వేగ, సాంస్కృతిక ఉనికిగా న్యాయమూర్తి అభివర్ణించారు. ఒక భాషకు చెందిన యావత్ సమాజం ప్రతిష్టను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసే హక్కు ఏ వ్యక్తికీ లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అ విధమైన వ్యాఖ్యలు చేయడానికి మీరేమైనా చరిత్రకారులా లేక భాషావేత్తా? ఏ భాష మరో భాష నుంచి జన్మించదు. ఒక చిన్న క్షమాపణతో ఈ మొత్తం సమస్య పరిష్కారం అయ్యేది అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. థగ్ లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో నిషేధిస్తున్నట్లు కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ) ప్రకటించిన దరిమిలా తన చిత్రం సజావుగా విడుదలయ్యేందుకు జోక్యం చేసుకోవాలని, థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని కోరుతూ కమల్ హాసన్ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరిగింది.
కర్ణాటకలో తన చిత్ర ప్రదర్శనను కేఎఫ్సీసీతోసహా ఏ ఒక్కరూ అడ్డుకోకుండా ఆదేశాలు జారీచేయాలని కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ఈ పిటిషన్ దాఖలుచేసింది. తమ చిత్ర ప్రదర్శనపై ప్రకటించిన నిషేధాన్ని అడ్డుకోని పక్షంలో చిత్రం విడుదలను నిలిపివేయాలని కమల్ నిర్ణయించుకున్నట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కర్ణాటకలో థగ్ లైఫ్ చిత్రం విడుదల విషయంలో వేచి ఉండడానికి ఆయన నిర్ణయించుకున్నట్లు న్యాయవాది ధ్యాన్ చిన్నప్ప తెలిపారు. ప్రస్తుతానికి తాము కర్ణాటకలో చిత్రం విడుదల చేయడం లేదని ప్రకటించారు.