Karnataka new bill | రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం హలాల్ మాంసాన్ని తురుపుముక్కగా ఎంచుకున్నది. హలాల్ మాంసాన్ని అడ్డం పెట్టుకుని హిందువుల ఓట్లు రాబట్టేందుకు కుట్రపన్నింది. హలాల్ మాంసంపై నిషేధం విధించే దిశగా పావులు కదుపుతున్నది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు బస్వరాజ్ బొమ్మై ప్రభుత్వం సిద్ధమైంది. ఒకవైపు హిజాబ్ ఆందోళనలు సమసిపోక ముందే మరో కొత్త ఎత్తుగడను బీజేపీ ప్రభుత్వం ఎత్తుకున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హిందుత్వ కార్డును మరోసారి ప్రయోగించి ఓట్లు రాబట్టాలని బీజేపీ చూస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
సర్టిఫైడ్ ఫుడ్ ఐటమ్స్ కాకుండా ఇతర వస్తువులను నిషేధించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా – FSSAI ని బీజేపీ ఎమ్మెల్యే ఎన్ రవికుమార్ డిమాండ్ చేశారు. హలాల్ మాంసంపై నిషేధానికి సంబంధించి ప్రైవేట్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రవికుమార్ సన్నాహాలు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ మేరకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు లేఖ రాసినట్లు సమాచారం. అయితే, ఇప్పుడు దీనినే సభలో బిల్లుగా సమర్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు అంతా దీనికి అంగీకారం తెలిపారు. ఈ విషయమై ఇవాళ మంత్రులు, నేతలతో సీఎం సమావేశమై చర్చించనున్నారు.
హిజాబ్ నిషేధానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కి ఉన్నది. ఇప్పుడు హలాల్ మాంసం నిషేధం అంశం ప్రతిపక్షాలకు తలనొప్పిగా తయారైంది. వచ్చే ఏడాది మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హిందుత్వ కార్డును ఉపయోగించి లాభపడాలని బీజేపీ యోచిస్తున్నది. ప్రభుత్వ, విపక్షాల మధ్య మతమార్పిడిపై సభలో వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉన్నది. హలాల్ మాంసానికి సంబంధించిన ప్రైవేట్ బిల్లును ఆమోదించవద్దని అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి అభ్యర్థిస్తామని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత బీకే హరిప్రసాద్ చెప్పారు. ఈ బిల్లును అసెంబ్లీలో అడ్డుకుంటామని ఆయన తెలిపారు.