న్యూఢిల్లీ, జనవరి 25: టికెట్ రాలేదన్న కారణంతో కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరిన ఆ రాష్ట్ర మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ గురువారం తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. చాలా మంది తన శ్రేయోభిలాషులు తాను తిరిగి బీజేపీలోకి రావాలని కోరుకున్నారని.. కమలం పార్టీతో తనది సుదీర్ఘ అనుబంధమని ఈ సందర్భంగా శెట్టర్ తెలిపారు. కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్ప, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో ఆయన గురువారం బీజేపీ కండువా కప్పుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసిన తర్వాత ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. లింగాయత్ నాయకుడైన శెట్టర్ ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి వరించింది. అయితే సొంత గూటిని చేరుకోవడం కోసం ఆయన ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. ప్రధాని మోదీ పాలనలో దేశం బలపడుతున్నదని శెట్టర్ ప్రశంసించారు.