బెంగళూర్ : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రజలను ఆకట్టుకునేందుకు కర్నాటక కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందించింది. ఫిబ్రవరి 16 నుంచి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామనే వివరాలతో కూడిన ప్రామిస్ కార్డులను ఇంటింటి ప్రచారంలో ఓటర్లకు పంపిణీ చేయనుంది.
పార్టీ నేతలు డీకే శివకుమార్, సిద్ధరామయ్య సంతకాలతో కూడిన హామీ పత్రాలను పార్టీ నేతలు ప్రజలకు అందచేస్తారు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌తో పాటు, మహిళలకు నెలకు రూ. 2000 చొప్పున నగదు అందిస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. బొమ్మై ప్రభుత్వంపై కాంగ్రెస్ విడుదల చేసిన చార్జిషీట్‌నూ పార్టీ నేతలు ప్రజలకు అందిస్తారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంటి తలుపు తట్టేలా నెలరోజుల పాటు ఈ ప్రచారం చేపట్టాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఉద్యోగ కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, టూరిజం అభివృద్ధి, సమాజంలో శాంతి సామరస్యాలను నెలకొల్పడం వంటి అంశాలతో కర్నాటక కాంగ్రెస్ ఇటీవల పది పాయింట్ల మేనిఫెస్టోను విడుదల చేయగా ఈ మేనిఫెస్టోను ఇంటింటికీ చేర్చే దిశగా ఈ క్యాంపెయిన్‌ను పార్టీ ఉపయోగించుకోనుంది. ప్రస్తుత కర్నాటక అసెంబ్లీ గడువు ఈ ఏడాది మే 24తో ముగియనుంది. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీలు ఇంతవరకూ తమ సీఎం అభ్యర్ధి ఎవరనేది ప్రకటించలేదు.