బెంగుళూరు: కర్నాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే(Congress MLA), మాజీ మంత్రి వినయ్ కులకర్ణిపై కేసు నమోదు అయ్యింది. అత్యాచారం, కిడ్నాప్, నేరపూరిత బెదిరింపులకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 34 ఏళ్ల ఓ సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సంజయ్ నగర్ పోలీసు స్టేషన్లో కేసు బుక్ చేశారు. ధార్వాడ్ ఎమ్మెల్యే కులకర్ణి.. ఫోన్, వీడియో కాల్స్ చేసి ఆమెను వేధిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసులో ఎమ్మెల్యే కులకర్ణిని ఏ1 నిందితుడిగా, అతని అనుచరుడు అర్జున్ను ఏ2 నిందితుడిగా పేర్కొన్నారు.
2022లో ఎమ్మెల్యేతో తొలిసారి పరిచయం జరిగిందని, అయితే అప్పటి నుంచి ఆయన తనకు వీడియో కాల్స్ చేసి అసభ్యకరరీతిలో మాట్లాడుతున్నట్లు ఆ మహిళ ఆరోపించింది. దేవనహల్లిలో ఉన్న కెంపగౌడ ఎయిర్పోర్టు సమీపంలోని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి కారులో అత్యాచారం చేసినట్లు ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నది. ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యేపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. రేప్, కిడ్నాప్, సాక్ష్యాల తారుమారు, వేధింపులు, దాడి లాంటి సెక్షన్ల కింద కేసును ఫైల్ చేశారు.