Minister Satish Jarkiholi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) బెంగళూరు, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ‘ముడా’ భూ కుంభకోణం, వాల్మీకి కార్పొరేషన్ కేసులు కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేసుల తీవ్రత దృష్ట్యా సీఎం మార్పు త్వరలోనే జరుగనున్నట్టు పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో పీడబ్ల్యూడీ మంత్రి సతీశ్ జార్కిహోళి కాంగ్రెస్ అధిష్ఠానానికి కీలక విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారుకు ఏదైనా ఇబ్బంది కలిగితే.. ఆ ప్రభావం తెలంగాణలోని రేవంత్ సర్కారుపై పడొచ్చని జోస్యం చెప్పారు. సీఎం సిద్ధరామయ్యను మార్చవద్దన్న మంత్రి.. పనిలో పనిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ విషయం పెద్దయెత్తున చర్చనీయాంశం అవుతున్నది.
‘హిమాచల్, తెలంగాణ సహా మనం మొత్తంగా ఓ మూడు, నాలుగు రాష్ర్టాల్లోనే అధికారంలో ఉన్నాం. మన ప్రభుత్వాలను కూల్చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తున్నది. ‘ముడా’ స్కామ్‌లో సిద్ధరామయ్యను విచారించడానికి గవర్నర్ అనుమతివ్వడం ఇందులో భాగమే. ఇలాంటి సమయంలోనే హైకమాండ్ దృఢంగా ఉండాలి. పార్టీ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేయాలి. ఒకవేళ, కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారుకు ఏదైనా ఇబ్బంది కలిగితే.. ఆ ప్రభావం తెలంగాణలోని రేవంత్ సర్కారుపై పడొచ్చు. ఇక్కడ సిద్ధరామయ్య ఇబ్బందులను ఎదుర్కొంటే, తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఇక్కడ సిద్ధరామయ్యకు నోటీసులు వచ్చినట్టే, అక్కడ రేవంత్‌కు కూడా రేపోమాపో నోటీసులు రావొచ్చు. ఆయననూ టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు సిద్ధరామయ్యను సీఎం పోస్టు నుంచి తప్పిస్తే, రేవంత్‌నూ తప్పించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే, తప్పుచేసినట్టు మనకు మనం ఒప్పుకొన్నట్టే. కాబట్టి, ‘ముడా’ కేసులో సిద్ధరామయ్యకు మనమంతా అండగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎంని మార్చొద్దు. ఈ మేరకు అధిష్ఠానం దృఢమైన నిర్ణయాన్ని తీసుకోవాలి’ అని జార్కిహోళి పేర్కొన్నారు.
‘ముడా’ కేసులో సిద్ధరామయ్యను విచారించడానికి గవర్నర్ అనుమతించడం తమకు ఎదురుదెబ్బేనని జార్కిహోళి ఒప్పుకొన్నారు. అయితే, ఈ విషయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాల్సిన అవసరమున్నదన్నారు.
కర్ణాటకలో నిరుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం పదవికి డీకే శివకుమార్, సిద్ధరామయ్యతో పాటు సతీశ్ జార్కిహోళి కూడా పోటీపడ్డారు. అయితే, అధిష్ఠానం సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై డీకే వర్గం అసంతృప్తితో రగిలిపోయింది. ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, అప్పటికే డీకే శివకుమార్‌తో విభేదాలు ఉన్న జార్కిహోళి ఇష్టంలేకపోయినా సిద్ధరామయ్యకు మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. తాజాగా వివాదాల కారణంగా సిద్ధరామయ్య సీఎం పదవికి దూరమైతే, డీకే ఆ పోస్టులోకి రావొచ్చన్న ఊహాగానాలు పెరిగిపోయాయి. డీకే సీఎంగా ఉండటం ఇష్టంలేకనే జార్కిహోళి ‘సిద్ధరామయ్యను సీఎంను మార్చొద్దంటూ’ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేసినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.