Karnataka | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఐదు గ్యారంటీల ప్రచారంతో కిందటేడాది కర్ణాటకలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ హయాంలో అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి తంతుపై సొంతపార్టీ నేతలే బహిరంగగా విమర్శలు గుప్పించడం సంచలనంగా మారింది. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ‘40% కమీషన్ రాజ్’ అక్రమాలతో పోలిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి అంతకంటే మించిపోయిందని కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బీ శివరాము సంచలన ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని సీఎం సిద్ధరామయ్యకు కూడా తెలియజేసినట్టు ఆయన పేర్కొన్నారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై శివరాము మాట్లాడుతూ.. “40% కమీషన్ రాజ్’ అంటూ గత ఎన్నికల్లో బీజేపీని లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేశాం. అలా ఆ ఎన్నికల్లో గెలిచాం. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. పరిస్థితులు బీజేపీ హయాంలో కంటే మరింత అధ్వానంగా తయారయ్యాయి. హసన్ జిల్లాలో అవినీతి పెచ్చరిల్లుతున్నది. ఇది ఇలాగే కొనసాగితే, జిల్లాకు చెడ్డ పేరు వస్తుంది. సీఎం సిద్ధరామయ్యతో కూడా ఇదే విషయాన్ని నేరుగా చెప్పా. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, దీనిపై వెంటనే దృష్టిసారించాలని విన్నవించా’ అని శివరాము పేర్కొన్నారు. ప్రభుత్వం నిలదొక్కుకోవాలంటే అవినీతిని అరికట్టడమే మార్గమన్న ఆయన.. దీనిపై తాను బహిరంగంగా మాట్లాడితే తనను చెడ్డవాడిగా ముద్ర వేస్తారని వాపోయారు. అయినప్పటికీ, తాను చెప్తున్నది ముమ్మాటికీ నిజమని నొక్కిచెప్పారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి పెరిగిపోయిందని తనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కూడా ఇదే అనుకొంటున్నట్టు తెలిపారు.