బెంగళూరు, సెప్టెంబర్ 30: కర్ణాటక కాంగ్రెస్‌కు ఎన్నికల్లో గెలిచి సర్కార్‌ను నడుపుతున్నామన్న సంతృప్తి లేకుండా పోయింది. ఓవైపు ఆపరేషన్ కమలం అంటూ బీజేపీ బెదిరిస్తుండగా.. మరోవైపు పార్టీలో గ్రూపు తగాదాలు, వర్గ పోరు, సొంత పార్టీ నేతల అసమ్మతిరాగంతో కర్ణాటక కాంగ్రెస్ సతమతమవుతున్నది. ఏకంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సీఎం సిద్ధరామయ్యల మధ్య పొసగడం లేదు. వారిద్దరూ రెండు వర్గాలుగా విడిపోయారు. తాజాగా కాంగ్రెస్ పాలనలో లింగాయత్‌లకు అన్యాయం జరుగుతున్నదని ఆ సామాజికవర్గానికి చెందిన పార్టీ ఎమ్మెల్యే శామనూర్ శివశంకరప్ప మరో వివాదానికి తెరలేపారు.
74 మంది లింగాయత్ ఎమ్మెల్యేలు ఉన్నారని, వేరే పార్టీలతో కలిసి తామే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకోగలమని సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వ పోస్టింగుల్లో లింగాయత్‌లకు అన్యాయం జరుగుతున్నది. ముఖ్యమైన పోస్టులు ఇవ్వకుండా పక్కన పెడుతున్నారు. రాష్ట్రంలో 74 మంది లింగాయత్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వేరే పార్టీలతో కలిసి మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలం. నేను ఎవరినీ చూసి భయపడను. ఈ విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాల్సిన అవసరం ఉంది. సీఎం సిద్ధరామయ్యతో మాట్లాడతా’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, సామాజికవర్గాల ఆధారంగా పోస్టింగులు ఇవ్వరని హోం మంత్రి పరమేశ్వర తెలిపారు.