బెంగుళూరు: కర్నాటకలోని కోఆపరేటివ్ బ్యాంకుకు చెందిన ఓ బ్రాంచీలో సుమారు 63 కోట్ల ఆర్థిక అవకతవకలు(Bank Fraud) జరిగాయి. ఆ కేసులో సహకార బ్యాంక్ మాజీ చైర్మెన్ ఆర్ఎం మంజునాథ గౌడ్‌ను ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. మనీల్యాండరింగ్ చట్టం కింద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరులోని ప్రత్యేక కోర్టులో అతన్ని ప్రవేశ పెట్టారు. మంజునాథ గౌడను సుమారు 14 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
బెంగుళూరుతో పాటు శివమొగ్గ జిల్లాల్లో ఈడీ ఇటీవల తనిఖీలు చేపట్టింది. శివమొగ్గ జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్‌లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. భారీ స్థాయిలో నిధుల అవకతవకలు జరిగాయని, గౌడ ఆదేశాల మేరకు సిటీ బ్రాంచ్ మేనేజర్ బీ శోభ అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ ఆరోపించింది. ఈడీ చేసిన ఆరోపణలపై స్పందించేందుకు బ్రాంచ్ మేనేజర్లు అందుబాటులో లేరు. లోకాయుక్త పోలీసుల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మేనేజర్ శోభతో కలిసి చైర్మెన్ 63 కోట్ల నిధుల్ని అక్రమంగా తరలించినట్లు ఈడీ పేర్కొన్నది.
అకౌంట్ హోల్టర్లకు తెలియకుండా గోల్డ్ లోన్ అకౌంట్లను అక్రమంగా ఓపెన్ చేసి నిధుల్ని స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీని కోసం నకిలీ డాక్యుమెంట్లు సమర్పించినట్లు ఈడీ పేర్కొన్నది. బ్యాంక్ నుంచి అక్రమంగా తీసిన డబ్బును .. మేనేజర్ శోభ.. చైర్మెన్ గౌడకు పంపినట్లు ఈడీ తన రిపోర్టులో తెలిపింది. ఆ డబ్బుతో మంజునాథ గౌడ్.. వివిధ ప్రదేశాల్లో ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు లోకాయుక్త పోలీసులు గుర్తించారు.