బెంగళూరు, నవంబర్ 25: కర్ణాటకలో అధికార మార్పిడిపై ఉధృతంగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో నాయకత్వ మార్పు చుట్టూ జరుగుతున్న ప్రచారానికి కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రమే ముగింపు పలకగలదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం తెలిపారు. ఈ గందరగోళానికి ముగింపు పలికేందుకు త్వరితంగా నిర్ణయం తీసుకోవాలని పార్టీ కేంద్ర నాయకత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీ అధిష్ఠానం వద్దన్నప్పటికీ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లవచ్చని విలేకరులతో మాట్లాడుతూ ఆయన తెలిపారు. వారికి(ఎమ్మెల్యేలు) ఆ స్వేచ్ఛ ఉంది. వారికి ఏవైనా అభిప్రాయాలుంటే ఏం చెప్పదలచుకున్నారో చెప్పుకోనివ్వండి. చివరకు నిర్ణయం తీసుకోవలసింది పార్టీ అధిష్ఠానమే అని ఆయన వ్యాఖ్యానించారు. నాయకత్వ మార్పుపై చర్చలు సాగుతున్న ప్రస్తుత తరుణంలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యే ఆలోచనలేవీ తనకు లేవని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. క్యాబినెట్లో మార్పులు చేర్పులపై జరుగుతున్న ఊహాగానాలను కూడా ఆయన అనవసర లొల్లిగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఉండాల్సిన 34 మంత్రి పదవులలో రెండు మాత్రమే ఖాళీగా ఉన్నాయని, పార్టీ అధినాయకత్వం పచ్చ జెండా ఊపితే వాటిని కూడా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి వివరించారు.
అది సీక్రెట్ డీల్
ముఖ్యమంత్రి మార్పు గురించి తాను బహిరంగంగా మాట్లాడదలచుకోలేదని, అది తమ పార్టీలోని నలుగురైదుగురికి మధ్య ఉన్న రహస్య ఒప్పందమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం తెలిపారు. తాను మనస్సాక్షిని నమ్ముతానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పార్టీకి ఎటువంటి ఇబ్బందిని కలిగించి బలహీనపరచడం తనకు ఇష్టం లేదని తన సొంత నియోజకవర్గం కనకపురలో విలేకరులతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నవంబర్ 20వ తేదీతో రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య 2023లో అధికార పంపకం ఒప్పందం కుదిరినట్లు ఊహాగానాలు సాగుతున్న తరుణంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు గురించి జోరుగా వదంతులు కొనసాగుతున్నాయి. నవంబర్ విప్లవం పేరిట రాష్ట్రంలో అధికారం కోసం పోరాటం సాగుతున్నట్లు ప్రస్తుత పరిణామాలు బహిర్గతం చేస్తున్నాయి.
గడచిన కొన్ని రోజులుగా బెంగళూరులో ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలుసుకున్న డీకే అనంతరం ఢిల్లీకి బయల్దేరిన ఖర్గేకు విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు చేపట్టడం ఖాయమేనా అన్న ప్రశ్నకు తనకు తెలియదని, తనను ముఖ్యమంత్రిని చేయవలసిందిగా ఖర్గేను కోరలేదని చెప్పారు. అది మా ఐదారుగురి మధ్య ఉన్న రహస్య ఒప్పందం. దీనిపై బహిరంగంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నా మనస్సాక్షిని నమ్ముతాను. మనమందరం మనస్సాక్షి ప్రకారం పనిచేయాలి. పార్టీని ఇబ్బందిపెట్టే పనేదీ నేను చేయను. పార్టీని బలహీనపరచను. పార్టీ ఉంటేనే మేమంతా ఉంటాం. కార్యకర్తలు ఉంటేనే మేము కూడా ఉంటాము అని ఆయన అన్నారు. నాయకత్వ మార్పు గురించి విలేకరుల ప్రశ్నకు సమాధానమిస్తూ దానిపై ముఖ్యమంత్రి(సిద్ధరామయ్య) ఇప్పటికే మాట్లాడారు. ఆయన చాలా సీనియర్ నాయకుడు. పార్టీకి ఆయన గొప్ప ఆస్తి. ముఖ్యమంత్రిగా ఆయన 7.5 ఏళ్లు (2013-2018 మధ్య ఐదేళ్ల పదవీకాలాన్ని కలుపుకొని) పూర్తిచేశారు అని చెప్పారు.
రేసులో మంత్రులు..
ముఖ్యమంత్రి పదవిని తాము కూడా ఆశిస్తున్నట్లు కొందరు మంత్రులు బాహాటంగా వెల్లడించారు. సీఎం పదవిని ఆశించడం తప్పేమీ కాదని ఆరోగ్య మంత్రి శివానంద్ పాటిల్ చెప్పగా తాను మొదటినుంచి ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని హోం మంత్రి జీ పరమేశ్వర ప్రకటించారు. అవకాశం వస్తే దాని గురించి మాట్లాడతానని కూడా ఆయన అన్నారు. కాగా, రొటేషన్ ఫార్ములా వదంతులను గృహ నిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ తోసిపుచ్చారు. చెరి రెండున్నరేళ్లు పాలించడం గురించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య ఎటువంటి ఒప్పందం లేదని ఆయన స్పష్టం చేశారు.