బెంగళూరు, అక్టోబర్ 16: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ముడా చైర్మన్ కే మరిగౌడ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పాటు తన అనారోగ్య సమస్యల వల్ల రాజీనామా చేస్తున్నానని, తనపై ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన ప్రకటించారు.
ముడా స్కామ్‌పై ఆయన స్పందిస్తూ.. విచారణ కొనసాగుతున్నదని, అక్రమాలు జరిగాయా అనేది విచారణలో తేలుతుందని పేర్కొన్నారు. తాను 40 ఏండ్లుగా సిద్ధరామయ్యతో ఉన్నానని, ఆయనే తనను తాలుకా, జిల్లా పంచాయతీ అధ్యక్షుడిని చేశారని, చట్టవ్యతిరేక పనులు చేయమని ఆయన తనకు ఎప్పుడూ చెప్పలేదని అన్నారు.
వాల్మీకి స్కామ్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్లు చెప్పాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తనను ఒత్తిడికి గురిచేసిందని మాజీ మంత్రి బీ నాగేంద్ర ఆరోపించారు. బుధవారం జైలు నుంచి విడుదలైన ఆయన మాట్లాడుతూ ‘వాల్మీకి స్కామ్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి, సిద్ధరామయ్యకు, డీకే శివకుమార్‌కు, నాకు సంబంధం లేదు. అనవసరంగా ఈడీ ఈ కేసులో ముఖ్యమంత్రిని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నది.’ అని ఆయన ఆరోపించారు.