Muda Scam | ముడా స్కామ్‌లో లోకాయుక్త ఎదుట హాజరవుతానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు ఇటీవల లోకాయుక్త విచారణకు రావాలని సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. హుబ్లీ ధార్వాడ్‌లో మంగళవారం ముఖ్యమంత్రి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకాయుక్త ఎదుట హాజరవుతున్నారా? అని ఆయనను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ రేపు (బుధవారం) ఉదయం 10 గంటలకు వెళ్తున్నానని బదులిచ్చారు. ఈ నెల 6న విచారణకు రావాలని సిద్ధరామయ్యకు లోకాయుక్త సమన్లు పంపింది.
ఇంతకు ముందు ఈ కేసులో సీఎం భార్య పార్వతిని అక్టోబర్ 25న విచారించారు. ఆమె సోదరుడు మల్లికార్జున స్వామితో పాటు దేవరాజులను విచారించింది. దేవరాజు వద్ద మల్లికార్జున స్వామి భూమిని కొనుగోలు చేసి తన సోదరి పార్వతికి బహుమతిగా ఇచ్చారు. అయితే, సీఎం సిద్ధరామయ్య ఎలాంటి తప్పు చేయలేదని.. ఆయనను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని.. అందుకే ఆరోపణలు చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ముడా స్కామ్‌లో మాజీ కమిషన్ డీబీ నటేశ్ని ఈడీ ప్రశ్నించింది. విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నది. ముడా భూ కుంభకోణం కేసులో ఈడీ మానీలాండరింగ్ కోణం దర్యాప్తు చేస్తున్నది.
కేసు విషయానికి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA)కి చెందిన 3.2 ఎకరాల భూమి విషయంలో కుంభకోణానికి సంబంధించింది. అయితే, వాస్తవానికి సతీమణి పార్వతికి 2010లో ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి కేసరే గ్రామంలోని 3.2 ఎకరాల భూమిని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ భూమిని ముడా సేకరించింది. ఆ భూమికి పరిహారం ఇవ్వాలని పార్వతి డిమాండ్ చేయడంతో ముడా ఆమెకు దక్షిణ మైసూర్‌లోని విజయానగర్‌లో 14 ప్లాట్లను కేటాయించింది. ఈ ప్లాట్ల ధర.. ఆమె ఇచ్చిన భూమి ధర కంటే ఎంతో విలువైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు కేటాయించారని మండిపడుతున్నాయి. ఈ భూ కుంభకోణం విలువ రూ.3వేలకోట్ల నుంచి రూ.4వేల కోట్ల వరకు ఉంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.