Milk Price Hike | బెంగళూరు, సెప్టెంబర్ 14: కర్ణాటకలో పాల ధరను పెంచేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతున్నది. లీటర్ పాలపై రూ.5 ధర పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. శుక్రవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయాన్ని పరోక్షంగా ప్రకటించారు. రామనగర జిల్లా మగడిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. లీటరు పాలపై రూ.5 ధర పెంచేందుకు త్వరలో రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
సహకార సంఘాలు సైతం తమకు లీటరుపై 20 పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయని, దీనిపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. పాడి రైతుల డిమాండ్ మేరకు ధరలు పెంచుతున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ దీని వల్ల ప్రత్యక్షంగా ప్రజలపై భారం పడనుంది.
ఏడాదిన్నరలో మూడోసారి
గత ఏడాది మే నెలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాల ధరలు పెంచడం ఇది మూడోసారి. అధికారంలోకి రాగానే గత జూలైలో లీటరుపై రూ.3 పెంచింది. తర్వాత ఈ ఏడాది జూన్‌లో మరోసారి లీటర్‌పై రూ.2 పెంచింది. ఇప్పుడు మూడోసారి లీటర్‌పై రూ.5 పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తమవుతున్నది.
అయితే, పాడి రైతుల కోసం ప్రభుత్వం ధరలు పెంచుతున్నామని చెప్తూ వస్తున్నది. కానీ, పాల వినియోగదారులైన ప్రజలపై భారం పడకుండా మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కర్ణాటక ప్రభుత్వ సంస్థ అయిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కేఎంఎఫ్) రైతుల నుంచి పాలను సేకరిస్తుంది. నందిని బ్రాండ్‌తో ఈ పాలను ప్రజలకు విక్రయిస్తుంది. కర్ణాటకలో నందిని పాలకు భారీగా డిమాండ్ ఉంది.
మూడోసారి మద్యం ధర పెంపు!
గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చి ఎన్నికల్లో గట్టెక్కిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు వాటిని నెరవేర్చలేక నానా పాట్లు పడుతున్నది. ధరల పెంపుతో ప్రజలపైనే గ్యారెంటీల భారం మోపుతున్నది. గత జూన్‌లో పెట్రోల్, డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్‌ను లీటరుకు రూ.3 పెంచింది.
మరోవైపు మద్యంపై ఇప్పటికే రెండుసార్లు ధరలు పెంచి, ఇప్పుడు మూడోసారి పెంపు కోసం ప్రతిపాదన సిద్ధం చేసింది. గత ఏడాది జూలైలో అదనపు ఎక్సైజ్ డ్యూటీని 10 శాతం పెంచడంతో ఒక్కో బీర్‌పై రూ.10-15 వరకు ధర పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి పెంచడంతో ఒక్కో బీర్‌పై రూ.15 పెరిగింది. ఇప్పుడు మూడోసారి పెంచేందుకు సిద్ధమవుతున్నది.