బెంగళూరు: శక్తి పథకానికి లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు లభించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ప్రకటన నవ్వులపాలవుతున్నది. మహిళలు అత్యధిక సంఖ్యలో ఈ పథకం కింద ఉచితంగా బస్సుల్లో ప్రయాణించినందుకు ఈ గుర్తింపు లభించిందని సీఎం చెప్పారు. అయితే, బీజేపీ, జేడీఎస్ ఈ సర్టిఫికెట్ అసలు బండారాన్ని బయటపెట్టాయి. బీజేపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సీటీ రవి ఇచ్చిన ఎక్స్ పోస్ట్‌లో, ఈ సర్టిఫికెట్ నకిలీదని, దానిని కొనుక్కోవడానికి రేట్ కార్డ్ కూడా ఉందని చెప్పారు.
జనాన్ని మోసం చేయడానికి ఇలాంటి చౌకబారు ఎత్తులు వేస్తూ ఎంత కిందికి దిగజారుతారని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. ఈ సంస్థకు డబ్బులిచ్చి అవార్డులను పొందడానికి అవకాశాలు ఉన్నాయని, అవార్డ్ ప్లాన్స్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ను పోస్ట్ చేశారు. లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లిమిటెడ్‌ను జూలై 15న మూసేశారని జేడీఎస్ తెలిపింది. బీజేపీ ఐటీ సెల్ ఇన్‌ఛార్జి అమిత్ మాలవీయ స్పందిస్తూ, కాంగ్రెస్‌ను ఎవరో మోసం చేశారన్నారు.