Karnataka CM : కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) డీకే శివకుమార్ (DK Shivakumar) కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారింది. ఇటీవల ఆయన ఓ ర్యాలీలో సగం తిన్న యాపిల్ (Apple) పండ్లను జనంపైకి విసిరారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. డీకే తీరుపై ఆన్లైన్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. శివకుమార్ తన సొంత నియోజకవర్గమైన కనకపుర (Kanakapura) పరిధిలోని హారహళ్లి ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ ఘటన జరిగింది.
విమర్శలకు దారి తీస్తున్న కర్ణాటక కాంగ్రెస్ సీఎం డీకే శివకుమార్ చర్యలు
కనకపుర పర్యటనలో భాగంగా సగం యాపిల్ కొరికి కార్యకర్తల మీదికి విసిరేసిన డీకే శివకుమార్
రాచరికపు పోకడలు అంటూ ప్రజల విమర్శలు https://t.co/gdKhQfasbV pic.twitter.com/PkFdbvjYEv
— Mirror TV (@MirrorTvTelugu) June 9, 2026
హారహళ్లిలో స్థానిక మద్దతుదారులు, ప్రజలు డీకే శివకుమార్‌కు ఘనస్వాగతం పలికారు. ఇందులో భాగంగా వందలాది యాపిల్ పండ్లు, పూలతో తయారు చేసిన ఓ భారీ ‘గజమాల’ను క్రేన్ సహాయంతో ఆయనకు బహూకరించారు. ఆ సమయంలో వాహనంపై ఉన్న డీకే శివకుమార్.. ఆ గజ హారం నుంచి రెండు యాపిల్ పండ్లను తీసి, నోటితో కొరికి జనంవైపు విసిరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అయిన కొద్దిసేపటికే పెద్ద దుమారం రేగింది. ఆయన మద్దతుదారులు దీన్ని ‘అభిమానులతో సరదాగా గడిపిన క్షణం’ అంటూ సమర్థించుకుంటుండగా మెజారిటీ నెటిజన్లు మాత్రం ఆయన ప్రవర్తనపై తీవ్రంగా మండిపడుతున్నారు.
డీకే శివకుమార్ తనను తాను దేవుడిగా భావిస్తున్నారా..? ఎంగిలి యాపిల్‌ను ప్రసాదంలా జనంపైకి విసరడం ఏంటి..? అని ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదని, రాచరికపు పోకడ అని, ప్రజలను పెంపుడు జంతువుల్లా చూస్తూ ఎంగిలి ముక్కలు విసరడం అత్యంత అసహ్యకరం అని నెటిజన్లు ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు.