Karnataka | బెంగళూరు, జనవరి 2: కర్ణాటక ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో భారం మోపింది. ఆర్టీసీ బస్సు చార్జీలను 15 శాతం పెంచుతూ సిద్ధరామయ్య సర్కారు గురువారం నిర్ణయం తీసుకుంది. శక్తి పథకం పేరుతో అమలు చేస్తున్న ఉచిత బస్సు భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి చెందిన కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(కేఎస్ఆర్టీసీ), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(కేడబ్ల్యూకేఆర్టీసీ), కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(కేకేఆర్టీసీ), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(బీఎంటీసీ)ల్లో బస్సు టికెట్ల చార్జీలను పెంచుతున్నట్టు మంత్రి హెచ్కే పాటిల్ ప్రకటించారు. నిర్వహణ ఖర్చులు, డీజిల్ ధరలు పెరగడం వల్లే చార్జీలు పెంచినట్టు ఆయన పేర్కొన్నారు.
2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మహిళలను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ ‘శక్తి’ పేరుతో గ్యారెంటీని ప్రకటించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చింది. 2023 జూన్ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. అయితే, ఈ పథకం రాష్ట్ర ఖజానాకు భారంగా మారింది. నవంబర్ నాటికి నాలుగు ఆర్టీసీలకు ప్రభుత్వం రూ.1,694 కోట్లు బకాయి పడింది. ఆర్టీసీలు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకున్నాయి.దీంతో ఉచిత బస్సు భారాన్ని తగ్గించుకునేందుకు, ప్రభుత్వ బకాయిలతో దివాలా తీస్తున్న ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ప్రభు త్వం టికెట్ ధరల పెంచుతున్నదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఉచిత బస్సు పథకం ప్రభుత్వానికి గుదిబండలా మారడంతో ఎత్తేసేందుకూ ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే మహిళలు టికెట్లు కొంటామని చెప్తున్నారని, పథకంపై సమీక్షిస్తామని అక్టోబరులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఈ పథకాన్ని నిలిపేస్తారా అనే విమర్శలురావడంతో ప్రభుత్వ ప్రయత్నాలు వికటించాయి. దీంతో ఇప్పుడు టికెట్ల రేట్ల పెంపుతో భారాన్ని కొంత తగ్గించుకుంటున్నది.