Plastic in Idli | బెంగళూరు, ఫిబ్రవరి 27: దక్షిణ భారతీయులు ఇష్టంగా తినే ఇడ్లీల్లో ప్లాస్టిక్ ఆనవాళ్లు ఉండటం కర్ణాటకలో కలకలం రేపింది. హోటళ్లలో ఇడ్లీలను తయారు చేసేటప్పుడు పాత్రలపై వస్ర్తాన్ని కప్పి, దానిపై పిండి వేస్తారు. అయితే, కర్ణాటకలోని పలు హోటళ్లలో వస్ర్తానికి బదులు పాలిథీన్ షీట్లు వినియోగిస్తున్నారని ఇటీవల ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో ఆహార భద్రత శాఖ అధికారులు రాష్ట్రంలో 251 హోటళ్లపై దాడులు చేసి నమూనాలు సేకరించారు.
వీటిని పరీక్షించగా 52 హోటళ్లలో ఇడ్లీల తయారీకి ప్లాస్టిక్ వినియోగించినట్టు గుర్తించారు. ప్లాస్టిక్‌లో ఉండే క్యాన్సర్ కారకాలు ఇడ్లీల ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇడ్లీల తయారీకి ఎక్కడా పాలిథీన్ షీట్లు వాడొద్దని నిషేధం విధించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు గురువారం ప్రకటించారు.