బెంగళూరు, మే 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజా వ్యతిరేకత తప్పించుకొనేందుకు గుజరాత్లో చేసిన కొత్త ముఖాల ప్రయోగం కర్ణాటకలో బెడిసికొట్టింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 75మంది కొత్త అభ్యర్థులను పోటీ పెట్టగా.. వీరిలో దాదాపు 20 మంది మాత్రమే గెలిచారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్.. పార్టీ, ప్రభుత్వంపై పట్టు కోసం తన పట్ల విధేయత ప్రదర్శించని ఎమ్మెల్యేల స్థానంలో తన అనూయాయులకు టిక్కెట్లు ఇవ్వటం పార్టీ ఓటమికి దారి తీసిందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రులు, నియోజకవర్గాల వైపు చూడని ఎమ్మెల్యేలను మార్చివుంటే సానుకూల ఫలితాలు వచ్చేవేమోనని ఆ పార్టీ నేతలు అనుకొంటున్నారు. హోసపేట లో పోటీచేసిన మంత్రి ఆనంద్‌సింగ్ తనయుడు సిద్ధార్థసింగ్ ఓడిపోయారు. ఆనంద్‌సింగ్ విజయనగర జిల్లా ఏర్పాటులో, జిల్లా అభివద్ధికి అధికంగా నిధుల్ని విడుదల చేయించటంలో ప్రముఖ పాత్ర వహించారు. కొప్పళ నుంచి పోటీచేసిన లోక్‌సభ సభ్యుడు కరడి సంగణ్న కోడలు మంజుల అమరేశ్ గౌడ కూడా ఓడిపోయారు. ఇలా ప్రముఖల కుటుంబసభ్యుల్ని సైతం జనం తిరస్కరించారు.