బెంగళూరు: యావత్ దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కర్ణాటకల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Karnataka Polls) మరికాసేపట్లో తేలనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఈ నెల 10న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 73.19 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 36 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. మొదట ఇంటి వద్ద నుంచి వేసిన ఓట్లను, పోస్టల్ బ్యాలెట్లను కౌంట్ చేయనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ అయిన 113 సీట్లు సాధించాల్సి ఉంటుంది.
అధికారం తమదంటే తమదే అన్న ధీమాతో ప్రధాన పార్టీలు ఉండటంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. మరో రెండు నుంచి మూడు గంటల్లో ఫలితాలపై స్పష్టత రానున్నది.