న్యూఢిల్లీ : వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ‘దేశద్రోహం’ వ్యాఖ్యలకు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ శుక్రవారం దీటుగా బదులిచ్చారు. 2014 నుంచి దేశ ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తున్నవారే నిజమైన దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.
వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను మహాత్మాగాంధీ సమర్థించారని, మొత్తం రాజ్యాంగ పరిషత్ కూడా మొదటి రెండు చరణాలనే జాతీయగేయంగా ఆమోదించిందని, అమిత్ షా మాటల ప్రకారం చూస్తే, మహాత్మాగాంధీతో పాటు మొత్తం రాజ్యాంగ పరిషత్ సభ్యులు కూడా దేశద్రోహులే అవుతారని సిబల్ పేర్కొన్నారు.