న్యూఢిల్లీ, జూలై 18 : మనీ లాండరింగ్ కేసుల్లో ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిన ఈడీ అధికారి కపిల్ రాజ్ ప్రభుత్వ సర్వీసుకు రాజీనామా చేశారు. రెవెన్యూ సర్వీస్‌కు ఆయన చేసిన రాజీనామాను ఆమోదించినట్టు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. ఆయన రాజీనామా జూలై 17 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. 45 ఏండ్ల కపిల్‌రాజ్ 2009 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ఆయన ఈడీలో 8 సంవత్సరాలు పనిచేశారు.
ఆయన రాజీనామా చేసేనాటికి ఢిల్లీ జీఎస్టీ ఇంటెలిజెన్స్ వింగ్ అదనపు కమిషనర్‌గా ఉన్నారు. కాగా, భూ కుంభకోణం కేసులో అప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ను గత ఏడాది జనవరిలో, మరో కేసులో అదే ఏడాది మార్చిలో అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కపిల్ రాజ్ నేతృత్వంలోని ఈడీ బృందాలే అరెస్ట్ చేశాయి. వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు.