బెంగళూరు: కన్నడ నటుడు దర్శన్ తూగుదీపను బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి బళ్లారిలోని జైలుకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఆయన ఫ్యాన్ రేణుక స్వామి హత్య కేసులో ఆయనతోపాటు మరికొందరు నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే దర్శన్ రౌడీషీటర్లతో జల్సాగా టీ తాగుతూ, సిగరెట్ కాల్చుతూ ఆనందంగా గడుపుతున్నట్లు ఓ ఫొటో బయటపడింది. అంతేకాకుండా ఆయన జైలు నుంచి వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు ఓ వీడియో వైరల్ అయింది. వీటిపై దర్యాప్తు జరిపిన అధికారులు సోమవారం ఈ జైలు చీఫ్ సూపరింటెండెంట్‌తోపాటు తొమ్మిది మందిని సస్పెండ్ చేశారు. దర్శన్‌కు రాజ భోగాలపై మూడు కేసులను నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ బీ దయానంద చెప్పారు. రేణుక స్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, ఈ జైలులో కస్టడీలో ఉన్నవారిని కూడా ఇతర జైళ్లకు తరలించాలని అధికారులను కోరినట్లు తెలిపారు.