న్యూఢిల్లీ : 2024 సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పేర్కొన్నారు. ప్రజలు కోరితే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు తనకు అవకాశం ఇస్తే వారి కోసం ఏ రకంగా సేవలందించేందుకైనా తాను అంగీకరిస్తానని ఓ వార్తా చానెల్‌తో మాట్లాడుతూ ఆమె చెప్పుకొచ్చారు.
త్వరలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తున్న తప్పుడు హామీలను హిమాచల్ ప్రజలు విశ్వసించరని అన్నారు. అక్కడి ప్రజలకు సొంతంగా సోలార్ విద్యుత్ ఉందని, వారు తమ కూరగాయాలను తామే పండించుకుంటారని అన్నారు.
హిమాచల్‌లో ఆప్ ఉచిత హామీలు ఆ పార్టీకి ఓట్లు రాల్చవని బాలీవుడ్ క్వీన్ పేర్కొన్నారు. ఇక కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జెన్సీ మూవీలో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, సతీష్ కౌశిక్, శ్రేయాస్ తల్పాడె, మిలింద్ సొమన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.