భోపాల్: అధికారం పక్కా అనుకున్న మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ (Congress) పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. బీజేపీ (BJP) ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, ఈసారి తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని చెబుతూ వచ్చిన పీసీసీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ (Kamal Nath) మాటలు నిజం కాలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడలేకపోయారని, ప్రచారంలో అలసత్వం వహించారని అందుకే ఓడిపోవాల్సి వచ్చిందని పార్టీ నాయకులు ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టారు. కమల్‌నాథ్ వల్లే 66 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చిందని ఆరోపించారు. దీంతో ఆయనను పీసీసీ అధ్యక్ష పదవి (PCC Chief) నుంచి పార్టీ అదిష్ఠానం తొలగించింది. ఓబీసీ నేత అయిన జీతు పట్వారీని (Jitu Patwari) నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీచేసింది. ఇంది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
దీంతో కమల్‌నాథ్ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఆయన వయస్సు 77 ఏండ్లు. మరో ఐదేండ్లు బీజేపీయే రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. మళ్లీ ఎన్నికల నాటికి ఆయనకు 82 ఏండ్లు దాటిపోతారు. ఎలాగూ కేంద్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనుచూపుమేర కనిపించడం లేదు. అందువల్ల ఆయన ఇకపై ఇంటికి పరిమితం కావాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.
కాగా, మరో నాలుగు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే కమల్‌నాథ్ నాయకత్వంలో పార్టీ ఘోరపరాభవాన్ని ఎదుర్కొంది. మరోసారి ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లడం మంచిదికాదని భావించిన అధిష్ఠానం పీసీసీ అధ్యక్షుడిగా ఆయనపై వేటువేసింది. మాజీ సీఎం స్థానంలో ఓబీసీ కమ్యూనిటీకి చెందిన జీతు పటేల్‌ను నియమించింది. మధ్యప్రదేశ్‌లో 50 శాతానికిపైగా ఓబీసీ ఓటర్లే ఉండటం గమనార్హం. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో రవు నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన 35 వేలకుపైగా ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.