చెన్నై: ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్‌కు కీలక పదవి దక్కనున్నది. అధికార డీఎంకే మద్దతుతో తమిళనాడు నుంచి ఆయన రాజ్యసభకు నామినేట్ కానున్నట్టు పార్టీ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఈ ఏడాది జూలైలో మరో విడత రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు మంత్రి పీకే శేఖర్ బాబు బుధవారం కమల్ హాసన్‌ను ఆయన నివాసంలో కలుసుకుని చర్చలు జరిపారు. మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) పార్టీని స్థాపించిన కమల్ హాసన్ గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల కోసం డీఎంకే సారథ్యంలోని కూటమితో చేతులు కలిపి ప్రచారం నిర్వహించారు. కూటమి మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది ఎంఎన్ఎంకు ఒక రాజ్యసభ స్థానం దక్కనున్నది.