Kamal Haasan | విశ్వ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ నేత కమల్ హసన్‌ను చంపేస్తానని ఓ టీవీ నటుడు హెచ్చరించాడు. ఇటీవల కార్యక్రమంలో కమల్ హసన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించాయి. పలు టీవీ షోల్లో పని చేసిన నటుడు రవిచంద్రన్ ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హసన్‌పై అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు. కమల్ హసన్‌ను బుద్ధిలేని రాజకీయ నాయకుడిగా అభివర్ణించారు. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు గొంతుకోస్తానని హెచ్చరించారు. రవిచంద్రన్ వ్యాఖ్యలపై కమల్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బెదిరింపులపై కమల్ పార్టీకి చెందిన పలువురు సభ్యులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి.. నటుడికి రక్షణ కల్పించాలని కోరారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన కమల్.. తమిళ నటుడు సూర్యకు చెందిన అగరం ఫౌండేషన్ 15వ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నీట్ పరీక్షలపై విమర్శలు గుప్పించారు. నీట్ 2017 నుంచి చాలామంది ఎంబీబీఎస్ చేయాలన్న కలలను కల్లలు చేసిందని ఆరోపించారు. అలాగే, మరోసారి సనాతన ధర్మంపై విరుచుకుపడ్డారు. నియంతృత్వం, సనాతన ధర్మం సంకెళ్లను బద్దలు కొట్టగల ఏకైక ఆయుధం విద్య అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీతో పాటు పలువురు నేతలు ఖండించారు. ఇదిలా ఉండగా కమల్ హసన్ సినిమాల విషయానికి వస్తే.. చివరిసారిగా ఈ ఏడాది థగ్ లైఫ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఇక రవిచంద్రన్ విషయానికి వస్తే పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపును పొందారు. పాండియన్ స్టోర్స్ టెలివిజన్ షోలో నటించారు. సెంథిల్ క్యారక్టర్లో నటించి మంచి గుర్తింపును పొందారు.