చెన్నై : ఫిల్మ్ స్టార్ కమల్ హాసన్(Kamal Haasan).. రాజ్యసభకు ఎంట్రీ ఇవ్వనున్నారు. పార్లమెంట్ పెద్దల సభపై ఆయన కన్నేసినట్లు తెలుస్తోంది. ద్రావిడ మున్నేత కజగం(డీఎంకే) సపోర్టుతో హీరో కమల్.. రాజ్యసభలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. కమల్‌హాసన్‌ను ఎగువ సభకు పంపాలన్న అంశంపై మక్కల్ నీది మాయిమ్ పార్టీ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు ఇటీవల కమల్ చేసిన ఓ కామెంట్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. డీఎంకే తమ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థల పేర్లను ప్రకటించింది. అడ్వకేట్ విల్సన్, ఎస్ఆర్ శివలింగం.. డీఎంకే అభ్యర్థులుగా రాజ్యసభలో పోటీ చేయనున్నారు. ఒప్పందం ప్రకారం మరో సీటును కమల్ పార్టీకి డీఎంకే ఇచ్చేసింది.
తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ నటుడు కమల్‌హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన థగ్‌లైఫ్ సినిమా ఆడియో విడుదల సందర్భంగా చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నా జీవితం, నా కుటుంబం తమిళ భాష’ అని పేర్కొన్నారు. ‘నటుడు శివరాజ్‌కుమార్ మరో రాష్ట్రంలో నివసిస్తున్న నా కుటుంబ సభ్యుడు. అందుకే ఆయన ఈ రోజు ఇక్కడ ఉన్నారు. అందుకే నా ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు.. నా జీవితం, నా కుటుంబం తమిళ భాష అని చెప్పా. మీ భాష (కన్నడ) తమిళ నుంచే పుట్టింది. ఆ విధంగా మీరు భాగస్వామి అయ్యారు’ అని శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశించి అన్నారు.
అయితే తమిళం నుంచి కన్నడ పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. బెంగళూరులో థగ్‌లైఫ్ సినిమా బ్యానర్లను కొందరు ఆందోళనకారులు చించివేశారు. కర్ణాటకలో మీకు వ్యాపారం కావాలి.. కానీ కన్నడ భాషను అవమానిస్తారా? అని ధ్వజమెత్తారు.