చెన్నై: తమ పార్టీ అభ్యర్థులు ఈసారి తమిళనాడు అసెంబ్లీలోకి తప్పక అడుగుపెడతారని మక్కల్ నీధి మయ్యం (MNM) పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ (Kamal Haasan) నమ్మకం వ్యక్తం చేశారు. 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము బలంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి, అక్కడ మరింత పుంజుకోవడానికి ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని, తద్వారా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పారు. 2026లో తమిళనాడు అసెంబ్లీకి తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను పంపుతామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దానికోసం తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు.
2018లో ద్రవిడ రాజకీయాల్లో ప్రవేశించిన కమల్ హాసన్.. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీచేసినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. ఆయన కూడా కోయంబత్తూర్ సౌత్ నుంచి బరిలోకి దిగి బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో పరాజితులయ్యారు. అయితే తన పార్టీ బలాబలాలను తెలుసుకున్న ఆయన అధికార డీఎంకే కూటమిలో చేరారు. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు పలికారు. దీంతో ఆయనను సీఎం స్టాలిన్ రాజ్యసభకు పంపించారు. కాగా, రానున్న ఎన్నికల్లో పోత్తులో భాగంగా ఎంఎన్ఎం పార్టీకి కూడా కొన్ని స్థానాలు దక్కే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఆయన ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు.