KA Paul | అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ పౌరవిమానయాన శాఖ మంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విమానయాన శాఖ ఎంతో క్లిష్టమైనదని.. చిన్నవాడైన రామ్మోహన్ నాయుడికి ఏవియేషన్‌పై అవగాహన లేదని అన్నారు. రామ్మోహన్ ఒక్క గంట కూడా విమానయాన రంగం గురించి చదవలేదని పేర్కొన్నారు. అందుకే రామ్మోహన్ నాయుడిని భర్తరఫ్ చేసి, ఏవియేషన్‌పై అనుభవం ఉన్న ఎంపీకి విమానయాన శాఖ బాధ్యతలు అప్పగించాలని ప్రధాని మోదీని కోరారు.
రామ్మోహన్ నాయుడితో తనకు వ్యక్తిగత గొడవలు ఏమీ లేవని కేఏ పాల్ స్పష్టం చేశారు. ఆయనకు కేబినెట్లో ఇంకా వేరే పదవి రావాలని కోరుకుంటానని అన్నారు. కానీ భారత ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని విమానయాన శాఖ మంత్రి పదవి నుంచి రామ్మోహన్ నాయుడిని తొలగించాలని కోరారు. ప్రధాని మోదీపై అనేక దేశాల నుంచి ఒత్తిడి రాకముందే రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ కూడా రిటైర్మెంట్ ప్రకటించాలని.. ప్రధాని బాధ్యతను అమిత్‌షాకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర విమానయాన శాఖ మంత్రి పదవికి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి : KA పాల్
ఏవియేషన్ గురించి రామ్మోహన్ నాయుడుకి ఏమీ తెలియదు
గతంలో చిన్న ఘటనలు జరిగితేనే దానికి బాధ్యత వహించి తమ పదవులకు చాలా పెద్ద వాళ్లు రాజీనామా చేశారు
ఇంత పెద్ద ప్రమాదం జరిగితే రామ్మోహన్ నాయుడు ఎందుకు… pic.twitter.com/nsfI38nDWG
— BIG TV Breaking News (@bigtvtelugu) June 15, 2025
అంత పెద్ద విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా సీఈవో, విదేశాంగ మంత్రి రాజీనామా చేయకపోవడం ఆశ్చర్యంగా ఉందని కేఏ పాల్ తెలిపారు. భారత ప్రతిష్ట కాపాడటం కోసం తప్పు చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. జీ7 సమ్మిట్‌లో విమాన ప్రమాదంపై చర్చ జరగనుందని తెలిపారు. ముందస్తు ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇది ఉగ్రవాదుల దాడి అయ్యి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.