Modi 3.0 Cabinet | కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్డీఏ సర్కార్ కొలువు దీరింది. ఆదివారం ప్రధాని మోదీతోపాటు 72 మందితో కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. సోమవారం ప్రధాని మోదీ బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో వారిద్దరూ తొలిసారి కేంద్ర మంత్రి పదవులు చేపట్టారు. వారిలో ఒకరు కింజారపు రామ్మోహన్ నాయుడు (36). మరొకరు జీతన్ రాం మాంఝీ (79).
కొద్ది కాలం పాటు జీతన్ రాం మాంఝీ బీహార్ సీఎంగానూ, అంతకు ముందు నితీశ్ కుమార్ సర్కార్లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. 2015 అసెంబ్లీ ఎన్నికల ముందు మాంఝీని సీఎంగా నితీశ్ కుమార్ తప్పించడంతో హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) స్థాపించారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గయ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు.
ఒక ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుంచి మూడోసారి ఎన్నికైన కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. టీడీపీ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన కింజారపు ఎర్రన్నాయుడు కుమారుడే రామ్మోహన్ నాయుడు. ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో 2014 ఎన్నికల్లో రాజకీయ అరంగ్రేటం చేశారు. 2014, 2019 ఎన్నికల్లోనూ లోక్ సభకు ఎన్నికయ్యారు రామ్మోహన్ నాయుడు.
మరో యువ నేత రక్షా ఖాడ్సే (37) మహారాష్ట్రలోని రేవర్ స్థానం నుంచి ఎన్నికయ్యారు. లోక్ జనశక్తి (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి తొలిసారి కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన యువ నేతలు.