K Annamalai : తమిళనాడు రాజకీయ నేత కే అన్నామలై బీజేపీకి రాజీనామా చేశారు. ఈ అంశంపై ఆయన శుక్రవారం స్పందించారు. తాను కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. తాను స్వతంత్ర రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడులో గత ఏడాదివరకు బీజేపీకి అధ్యక్షుడిగా పనిచేశారు అన్నామలై. అనంతరం పదవి నుంచి తొలగించినప్పటికీ ఆయన బీజేపీలోనే ఉన్నారు.
తాజాగా బీజేపీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. బీజేపీ కూడా ఆయన రాజీనామాను ఆమోదించింది. అన్నామలై వెళ్లిపోవడం వల్ల తమకు పెద్దగా నష్టం లేదని బీజేపీ వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో అన్నామలై డిజిటల్ మీడియా వేదికగా శుక్రవారం స్పందించారు. కొత్త రాజకీయ వేదికను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. వ్యక్తి కేంద్రంగా సాగే రాజకీయాలు కాకుండా కామన్ మ్యాన్ పాలిటిక్స్ చేస్తానన్నారు. తాను బీజేపీకి రాజీనామా చేశానని, శుక్రవారం నుంచి కొత్త ప్రయాణం ప్రారంభమవుతుందున్నారు. ఎప్పటిలాగే తనకు అందరి మద్దతు కావాలని కోరారు. పారదర్శకత, విలువలు, ప్రజాసేవ లక్ష్యంగా, స్వచ్ఛమైన, అన్నిస్థాయుల నుంచి వేదికగా నిలిచే రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
తన రాజకీయ ఉద్యమం రాజకీయ పార్టీగా మారిన తర్వాత నాయకత్వానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు నిర్ణయిస్తానన్నారు. నాయకత్వానికి పరిమితులు పెడతానని, కాలపరిమితి నిర్ణయిస్తానని, వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహిస్తానని వివరించారు. ఇప్పటివరకు రాజకీయ పార్టీలు సంప్రదాయబద్ధంగా అమలు చేస్తున్న వ్యక్తి కేంద్రంగా సాగే రాజకయాలకు దూరంగా, సామాన్యుడి రాజకీయంగా తన వేదిక నిలుస్తుందన్నారు. రాజకీయాలు ఒక వ్యక్తి చుట్టూ తిరగడం సరికాదన్నారు. తన రాజకీయ ఉద్యమంలో చేరిన వారికి ఏపీజే అబ్దుల్ కలాం ఎథిక్స్ ఇన్ పాలిటిక్స్ ఇనిస్టిట్యూషన్‌లో తగిన శిక్షణ ఇస్తామన్నారు.
బీజేపీకి తాను గత ఏడాది డిసెంబర్లోనే రాజీనామా చేస్తానని చెప్పానని, కానీ, ఎన్నికల వరకు ఆగమని చెప్పడంతో ఆగానని ఆయన అన్నారు. తనకు ఇంతకాలం అవకాశం ఇచ్చిన బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తామన్నారు.