చెన్నై, జూన్ 5 : కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ కే అన్నామలై బీజేపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పోటీచేసే ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. అన్నామలై మక్కల్ ఇయక్కం(ఏఎంఐ) పేరిట ఉద్యమాన్ని ప్రకటించారు. ఒక కుటుంబానికి చెందిన రాజకీయాలు ఉండవు. శాశ్వత నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అనే భావనను బద్దలు కొడతాం. మనం మూఢనమ్మకాల రాజకీయాల నుంచి బయటపడి సామాన్యుడి రాజకీయాలు తీసుకురావాలి అని అన్నామలై తెలిపారు.
కే అన్నామలై రాజీనామా చేసిన కొన్ని గంటలకే మరి కొందరు కీలక నాయకులు సామూహిక రాజీనామాలు చేసి పార్టీ నుంచి నిష్క్రమించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్, రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్ తమ పదవులకు రాజీనామా చేశారు. అన్నామలై సారథ్యంలో ఏర్పడే కొత్త రాజకీయ పార్టీలో చేరాలన్న తమ ఉద్దేశాన్ని నాగరాజన్ వ్యక్తం చేశారు. సుమతి వెంకటేష్ తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.