Jyotiraditya Scindia | మధ్యప్రదేశ్‌లోని గుణ లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర పౌర, విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విజయం సాధించారు. తొలి నుంచి గుణ స్థానంపై తనకు గల పట్టును తిరిగి సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి యద్వేంద్రరావు దేశ్రాజ్ సింగ్‌పై సింధియా 4.44 లక్షల పై చిలుకు ఆధిక్యంలో ఉన్నారు.
2019 ఎన్నికల్లో గుణ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జ్యోతిరాదిత్య సింధియా.. బీజేపీ ప్రత్యర్థి కృష్ణ పాల్ సింగ్ మీద 10.65 శాతం ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో గుణ స్థానం నుంచి సింధియా ఓటమి పాలైనా.. ఆ స్థానంతో సింధియా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. 1989 నుంచి 1998 వరకూ ఆయన నానమ్మ విజయరాజే సింధియా.. బీజేపీ తరఫున గుణ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.
ఆయన తండ్రి మాధవరావు సింధియా 1971 నుంచి 1980 వరకూ, తిరిగి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 2001లో మాధవరావు సింధియా మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా.. 2002 ఉప ఎన్నికల్లో సమీప బీజేపీ ప్రత్యర్థి దేశ్ సింగ్ యాదవ్ పై విజయం సాధించారు. 2004, 2009, 2014 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో కేంద్ర క్యాబినెట్లో పలు శాఖలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య.. రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం నరేంద్రమోదీ క్యాబినెట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.