న్యూఢిల్లీ: పదవీ విరమణ చేయబోతున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తన వారసుని పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. తన తర్వాత సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్‌ను తదుపరి సీజేఐగా నియమించాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు తెలిపారు. దీంతో 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ వచ్చే నెల 24న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తున్నది. జస్టిస్ గవాయ్ వచ్చే నెల 23న పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2019 మే 24న నియమితులయ్యారు. సీజేఐ పదవిని చేపడితే దాదాపు 15 నెలలపాటు, అంటే, 2027 ఫిబ్రవరి 9 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు.
సుదీర్ఘ అనుభవం, కీలక తీర్పులు
జస్టిస్ సూర్యకాంత్ హర్యానాలోని హిసార్ జిల్లాలో 1962 ఫిబ్రవరి 10న మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన దాదాపు రెండు దశాబ్దాలపాటు న్యాయమూర్తిగా అనుభవం గడించారు. అధికరణ 370 రద్దు, వాక్ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, అవినీతి, పర్యావరణం, స్త్రీ, పురుష సమానత్వం వంటి అంశాల్లో మైలురాళ్ల వంటి తీర్పులిచ్చారు. వలస పాలన కాలంనాటి రాజద్రోహం చట్టాన్ని సస్పెండ్ చేసిన ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ కూడా ఉన్నారు. ఈ చట్టాన్ని ప్రభుత్వం సమీక్షించే వరకు దీని కింద కొత్త కేసులను నమోదు చేయవద్దని ఆదేశించారు. బీహార్‌లో ఎన్నికల కమిషన్ నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి తొలగించిన 65 లక్షల పేర్లను, వివరాలను వెల్లడించాలని ఈసీని ఆదేశించారు.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఈ ఆదేశాలిచ్చారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌తో సహా అన్ని బార్ అసోసియేషన్లలోనూ మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు కేటాయించాలని ఆదేశించారు. రక్షణ దళాలకు వన్ ర్యాంక్-వన్ పెన్షన్‌ను సమర్థించారు. ఇది రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటయ్యేదేనని తెలిపారు. సాయుధ దళాల్లో పర్మనెంట్ కమిషన్‌లో సమానత్వం కావాలని మహిళా అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపారు. 1967నాటి ఆలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం తీర్పును రద్దు చేసిన ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో సూర్యకాంత్ కూడా ఉన్నారు. ఈ విశ్వవిద్యాలయానికి ఉన్న మైనారిటీ హోదాపై పునఃపరిశీలన చేసేందుకు ఈ తీర్పు బాటలు తెరిచింది. పెగాసస్ స్పైవేర్ కేసును విచారించిన ధర్మాసనంలో కూడా ఆయన ఉన్నారు. చట్ట వ్యతిరేక నిఘా ఆరోపణలపై దర్యాప్తు కోసం సైబర్ నిపుణులతో ఓ కమిటీని ఈ ధర్మాసనం ఏర్పాటు చేసింది. దేశ భద్రత ముసుగులో రాజ్యం స్వేచ్ఛగా వ్యవహరించజాలదని చెప్పింది.