ప్రయాగ్‌రాజ్ : హిందుస్థాన్‌లో కార్యకలాపాలు మెజారిటీ ప్రజల ఆకాంక్షల మేరకే జరుగుతాయని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ అన్నారు. ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రయాగ్‌రాజ్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘దేశంలో నివసిస్తున్న మెజారిటీ ప్రజల ఆకాంక్షల మేరకు దేశంలో కార్యకలాపాలు జరుగుతాయి. ఇది చట్టం. చట్టం మెజారిటీని బట్టి పని చేస్తుంది. కుటుంబం లేదా సమాజం విషయంలో చూడండి. కేవలం మెజారిటీ వ్యక్తుల సంక్షేమం, సంతోషాలకు ప్రయోజనం కలిగించేదానినే ఆమోదిస్తారు’ అని జస్టిస్ యాదవ్ అన్నారు. సాంఘిక సామరస్యం, స్త్రీ, పురుష సమానత్వం, లౌకికవాదాలను బలపరచడమే ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) లక్ష్యమని చెప్పారు.