న్యూఢిల్లీ: తాను రిటైర్మెంట్ తీసుకునే వ్యక్తిని కానని, మరో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ఎంఆర్ షా అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదవీకాలం సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఎంఆర్ షా భావోద్వేగానికి లోనయ్యారు. ‘జీనా యహా మర్నా యహా’ అంటూ అలనాటి నటుడు రాజ్‌కపూర్ చిత్రగీతాన్ని కోట్ చేశారు. బార్ అసోసియేషన్ సభ్యులకు, సుప్రీంకోర్టు అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. న్యాయమూర్తిగా ఎంఆర్ షా సేవల్ని సీజేఐ చంద్రచూడ్ కొనియాడారు. కొవిడ్ సమయంలో సవాళ్లను ఎదుర్కొనడానికి ఆయన సిద్ధమయ్యేవారని అన్నారు.
జడ్జిమెంట్‌ను ఆయన వద్దకు పంపిస్తే, టీకా తాత్పర్యంతో సహా అంతా సిద్ధం చేసి..అదే రోజు రాత్రికి తనకు పంపేవారని, డ్రాఫ్టింగ్ కోసం పంపితే 48 గంటల్లో సిద్ధం చేసేవారని ఎంఆర్ షా పనితీరును గుర్తుచేసుకున్నారు. 1982లో న్యాయవాద వృత్తిని చేపట్టిన ఎంఆర్ షా, భూ వివాదాలు, రాజ్యాంగం, విద్య సంబంధమైన కేసుల్ని పరిష్కరించటంలో మంచి గుర్తింపు సాధించారు. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా, పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. నవంబర్, 2018లో సుప్రీం న్యాయమూర్తిగా ఎంపికయ్యారు.