న్యూఢిల్లీ, మే 14: భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి న్యాయవ్యవస్థను తీర్చిదిద్దడంలో జస్టిస్ గవాయ్ కీలకపాత్ర పోషించారు. రాజ్యాంగ అంశాలు, స్వేచ్ఛ, ముఖ్యంగా ప్రభుత్వ ‘బుల్డోజర్ న్యాయం’కు వ్యతిరేకంగా ఆయన చారిత్రాత్మక తీర్పులను వెలువరించారు. జస్టిస్ గవాయ్ న్యాయమూర్తిగా దాదాపు 300 తీర్పులను వెలువరించారు. కేజీ బాలకృష్ణన్ తరువాత దేశ అత్యున్నత న్యాయమూర్తి పదవిని అధిష్ఠించిన రెండో దళితుడు, మొదటి బౌద్ధ మతస్థుడు జస్టిస్ గవాయ్.
దాదాపు ఆరు నెలలపాటు సీజేఐగా కొనసాగనున్న గవాయ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ప్రమాణం చేయించారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన గవాయ్ సామాన్య స్థితి నుంచి అత్యున్నత న్యాయమూర్తి పదవికి ఎదిగారు. రాష్ట్రపతి ప్రమాణం చేసిన వెంటనే జస్టిస్ గవాయ్ తన తల్లి కమల్బాయ్ తాయి పాదాభివందనం చేశారు. నవంబర్ 24, 1960లో జన్మించిన గవాయ్ తండ్రి ఆర్ఎస్ గవాయ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు. జస్టిస్ గవాయ్ 2019, మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియుక్తులయ్యారు. ఆర్టికల్ 370, ఎలక్టోరల్ బాండ్స్, పెద్ద నోట్ల రద్దుపై సంచలన తీర్పులు ఇచ్చిన ధర్మాసనాలలో ఆయన సభ్యుడిగా ఉన్నారు.
గత ఆరేండ్లలో అనేక అంశాలపై విచారణ జరిపిన సుమారు 700 ధర్మాసనాలలో జస్టిస్ గవాయ్ సభ్యుడిగా ఉన్నారు. సీజేఐగా ప్రమాణం చేయడానికి ముందు తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగమే సుప్రీం అని చెప్పారు. రిటైర్మెంట్ తరువాత ఎటువంటి పోస్టులు చేపట్టబోనని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని బలపరిచిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ సభ్యునిగా ఉన్నారు. ఆయన నవంబర్ 23 వరకు సీజేఐగా కొనసాగుతారు.