లక్నో: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ (Ajay Rai) ఆరోపించారు. రాఫెల్ బొమ్మకు నిమ్మకాయ, మిరపకాలు కట్టి చూపిస్తూ కేంద్రాన్ని ఈ మేరకు ఎగతాళి చేశారు. ‘చాలా మాట్లాడే ఈ ప్రభుత్వం ఉగ్రవాదులను అణిచివేస్తామని చెబుతుంది. వారు రాఫెల్స్‌ను తీసుకువచ్చారు. కానీ హ్యాంగర్లలో ఉంచి మిరపకాయలు, నిమ్మకాయలు వేలాడదీస్తున్నారు. ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చేవారిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు?’ అని ఆయన ప్రశ్నించారు.
కాగా, 2019లో ఫ్రాన్స్‌లో రాఫెల్ యుద్ధ విమానానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పూజలు చేశారు. ఈ సందర్భంగా శుభసూచికంగా రాఫెల్ చక్రాల కింద నిమ్మకాయలను ఆయన ఉంచడాన్ని అజయ్ రాయ్ ఇలా గుర్తు చేశారు. అయితే రాఫెల్ బొమ్మతో ఆయన ఇలా ఎగతాళి చేయడంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. సాయుధ దళాల గౌరవాన్ని ఆయన దిగజార్చినట్లు పలువురు ఆరోపించారు.
మరోవైపు తన చర్యపై తీవ్ర వ్యతిరేకత రావడంతో అజయ్ రాయ్ సోమవారం స్పందించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కళ్లు తెరిపించేందుకే తాను ఇలా చేసినట్లు వివరణ ఇచ్చారు. ‘రాజ్‌నాథ్ సింగ్ రాఫెల్ టైర్ల కింద నిమ్మకాయలు ఉంచారు. ఆయన చేసిందే నేను చెప్పా. హ్యాంగర్లలో ఉన్న రాఫెల్ యుద్ధ విమాన చక్రాల నుంచి నిమ్మకాయలు ఎప్పుడు తొలగిస్తారు? ఉగ్రవాదులు, వారికి మద్దతిచ్చిన వారిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు అని ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు’ అని అన్నారు.
కాగా, కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ చర్యను ఆ పార్టీ నేతలతోపాటు కొన్ని ప్రతిపక్ష పార్టీలు సమర్థించాయి. రాఫెల్‌తో శత్రువులకు తగిన సమాధానం ఇవ్వాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత అశుతోష్ వర్మ డిమాండ్ చేశారు.