కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు మళ్లీ సమ్మెకు దిగారు. మంగళవారం నుంచి నిరవధికంగా, పూర్తిగా విధులను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. జూనియర్ వైద్యులు ఇన్ పేషంట్, ఔట్ పేషంట్ విభాగాల విధులు నిర్వహించాలని సుప్రీంకోర్టు పేర్కొన్న మరుసటి రోజే వారు సమ్మెకు దిగడం గమనార్హం. పని ప్రదేశాల్లో భద్రత కల్పించాలని, దవాఖానలలో రక్షణ చర్యలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనను పునః ప్రారంభించారు. పీజీ జూనియర్ వైద్యురాలి హత్యాచారంపై 42 రోజుల ఆందోళన తర్వాత సెప్టెంబర్ 21 నుంచి విధులకు హాజరవుతున్నామని, అయితే ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా తమ రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు విమర్శించారు. తమపై దాడులు కొనసాగుతూ ఉన్నాయని, అందుకే ఆందోళన తిరిగి ప్రారంభించినట్టు తెలిపారు.
న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం ఇన్సాన్కు మరోసారి పెరోల్ మంజూరైంది. ఆయన సోమవారం చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ ఆమోదించింది. హర్యానా శాసనసభ ఎన్నికల తరుణంలో ఆయనకు పెరోల్ మంజూరు చేయడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయనకు రాష్ట్రంలో పలుకుబడి ఉందని, ఆయన జైలు నుంచి బయటకు వస్తే, ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆరోపించింది. ఆయనకు పెరోల్ మంజూరు చేయరాదని ఈసీకి విజ్ఞప్తి చేసింది. ఆయన పెరోల్‌పై తాత్కాలికంగా జైలు నుంచి విడుదల కావడం ఇది 15వ సారి.