న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5 : మద్యం పాలసీ కేసులో బెయిల్ కోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరికొంత కాలం నిరీక్షించక తప్పేట్టు లేదు. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ, బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. గురువారం ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేయటాన్ని తప్పుబట్టింది. కోర్టు అనుమతి తీసుకోవాలి కదా.. అంటూ సీబీఐని మందలించింది. కేజ్రీవాల్ పిటిషన్లపై సెప్టెంబర్ 10న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది! సీబీఐ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. అరెస్టును ఢిల్లీ హైకోర్టు సమర్థించగా, ఆయన సుప్రీంను ఆశ్రయించారు.
న్యూఢిల్లీ: కెనడాలో జస్టిన్ ట్రూడో సర్కారు సంక్షోభంలో చిక్కుకున్నది. సిక్కు నేత జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమొక్రాటిక్ పార్టీ (ఎన్డీపీ) ట్రూడో నేతృత్వంలోని లిబరల్ గవర్నమెంట్‌కు మద్దతు ఉపసంహరించుకోవడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. వచ్చే ఏడాది అక్టోబరులో జరిగే ఎన్నికల వరకు ట్రూడో నిలకడగా పరిపాలన చేయగలరా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కెనడియన్లపై ప్రభావం చూపుతున్న సమస్యలను పరిష్కరించడంలో ట్రూడో ప్రభుత్వం విఫలమైందని జగ్మీత్సింగ్ విమర్శించారు. కార్పొరేట్ దురాశపరులకు లొంగిపోతున్నారని, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని దుయ్యబట్టారు.