Supreme Court | హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): భర్తతో భార్య ఎలా నడుచుకోవాలో, యువత ఎలాంటి వస్ర్తాలు ధరించాలో చెప్పే బాధ్యత కోర్టులది కాదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ స్పష్టంచేశారు. ఇలాంటి అంశాలపై ఉత్తర్వులు జారీ చేసే బాధ్యత కోర్టులకు లేదన్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు 1963లో భార్యాభర్తల వివాదంలో ఇచ్చిన ఉత్తర్వులను, నిరుడు కోల్కతా హైకోర్టు యువతుల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఉదహరించారు. భార్య ముందుగా లేచి భర్తను నిద్రలేపాలని, భర్తకు కాఫీ ఇవ్వాలని, భర్తకు నచ్చినట్టుగా భార్య వస్త్రధారణ ఉండాలని మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్తూనే.. ఆ విధంగా చేయకపోతే భార్యను కొట్టే హకు భర్తకు లేదని తీర్పు చెప్పిందని తెలిపారు. ఈ వివాదంలో భార్యను కొట్టే హకు భర్తకు లేదని తీర్పు చెప్పడం ఎంత కరెక్టో.. భార్య ఎలా ఉండాలో చెప్పిన రీజనింగ్ మాత్రం సమర్థనీయం కాదని చెప్పారు. ఇదే మాదిరిగా యువతుల వస్త్రధారణ ఎలా ఉండాలో గత ఏడాది కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా సుప్రీంకోర్టుకు వచ్చిందని అన్నారు.
ప్రజలు కోర్టుల నుంచి ప్రమాణాలతో కూడిన తీర్పులు ఆశిస్తున్నారని, వాళ్ల ఆశలు ఆవిరి కాకుండా చూడాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉన్నదని చెప్పారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ‘సమకాలీన న్యాయ పరిణామాలు-చట్టం-సాంకేతికతతో న్యాయవ్యవస్థ బలోపేతం’ అనే అంశంపై దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు జరిగింది. జస్టిస్ భూయాన్ మాట్లాడుతూ..ప్రజలు కోర్టులపై పెట్టుకున్న విశ్వసాన్ని నిలబెట్టే విధంగా రాజ్యాంగం కల్పించిన సమానత్వ హకును కాపాడుతూ తీర్పు చెప్పాలని అన్నారు. ప్రాథమిక స్థాయి సివిల్ జడ్జి జీతం ఐఏఎస్ /ఐపీఎస్ స్థాయి అధికారుల జీతాల కంటే ఎకువగా ఉంటున్నదని, ప్రజలు కూడా ఆ స్థాయిలో కోర్టుల నుంచి సత్వర న్యాయం ఆశిస్తున్నారని చెప్పారు. చట్టబద్ధత, నిష్పక్షపాతం వంటివి ప్రజలు ఆశిస్తున్నారని, ప్రజలు ఉంచిన నమ్మకమే న్యాయ వ్యవస్థ ఆస్తి అని అన్నారు.
న్యాయవ్యవస్థపై అనేక కోణాల్లో పరిశీలన పెరిగిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్ ఓకా చెప్పారు. ఇప్పటికే మీడియా, న్యాయవాదులు, పలు సంస్థలు తీర్పులను ఇతర అంశాలను పరిశీలించి సమీక్ష చేస్తున్నాయని, సోషల్ మీడియా ప్రభావం రానున్న రోజుల్లో కొత్త జడ్జిలకు సవాలుగా మారనున్నదని చెప్పారు. గతంలో పరిశీలన, అభిప్రాయాలు మాత్రమే వ్యక్తమయ్యేవని, ఇప్పుడు పనితీరుపై దురుద్దేశాలనూ అపాదిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. సామాజిక మాధ్యమాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టు జడ్జీల వరకు అందరికీ శిక్షణ అవసరమని అన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రసంగిస్తూ.. రాజ్యాంగ నైతికత, సమకాలీన మార్పులు, న్యాయమూర్తుల ప్రవర్తన, కోర్టుల తీర్పులు రాయడంలో సాంకేతికత వినియోగం వంటి అంశాలపై సదస్సు చర్చిస్తుందని చెప్పారు. జాతీయ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ సుజయ్ పాల్, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, తమిళనాడు. కర్ణాటక, కేరళ, రాష్ట్రాల జడ్జీలు పాల్గొన్నారు..