ముజఫర్‌నగర్(యూపీ), సెప్టెంబర్ 8 : నాలుగు నెలల్లో 23వ ఉరిశిక్షను ఒక వరకట్న మరణ కేసులో విధించిన అదనపు జిల్లా సెషన్స్ జడ్జి రవికుమార్ దివాకర్ పిరికి న్యాయమూర్తి అని పిలిపించుకోవడం కంటే చావే మేలని అన్నారు. వరకట్నం కోసం తన భార్యను తగలబెట్టిన నదీమ్‌కు మరణశిక్ష విధిస్తూ మాఫియాలు, గ్యాంగ్స్టర్లు లేదా నేరస్థుల ఒత్తిడికి లొంగిపోయి తాను తన న్యాయ విధులను నిర్వర్తించబోనని జడ్జి చెప్పారు.
ఫాస్ట్-ట్రాక్ కోర్టు జడ్జి మాట్లాడుతూ దేవుడికి తప్ప మరెవరికీ భయపడకూడదని తన తల్లిదండ్రులు తనకు నేర్పించారని, బలవంతులు, మాఫియాలు, గ్యాంగ్స్టర్లు లేదా నేరస్థులకు భయపడి వ్యవహరించడం న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. పిరికివాడైన న్యాయమూర్తిగా ముద్రపడటం కంటే మరణించడమే మేలని, తన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయగలిగినంత కాలం తన విధులను కొనసాగిస్తానని దివాకర్ పేర్కొన్నారు.