రాయ్‌పూర్: స్కూల్ హాస్టల్లో మూడు నెలలుగా కరెంట్ లేదని, ఆహారం, భోజనశాల అపరిశుభ్రంగా ఉన్నాయని 45 మందికి పైగా విద్యార్థినులు ఆరు కిలో మీటర్లు నడిచి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బీజేపీ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. స్కూల్ ప్రిన్సిపల్, గిరిజన సంక్షేమ శాఖ తమ సమస్యలను పరిష్కరించకపోవడంతో శివ్‌పూర్‌లోని ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు 30 కిలోమీటర్లు అంబికాపూర్‌కు పాదయాత్ర చేసి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలనుకొన్నారు.
గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత్ శుక్లా ఆరు కిలోమీటర్ల పాదయాత్ర తర్వాత విద్యార్థినులను సముదాయించి వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే బాలికలు చర్చకు ఇష్టపడకపోవడంతో ఆయన వారిని బస్సుల్లో జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు పంపించారు.