న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లును కొన్ని సిఫారసులతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సోమవారం ఆమోదించింది. ఈ కమిటీ సమావేశం అనంతరం చైర్మన్ జగదాంబిక పాల్ మీడియాతో మాట్లాడుతూ, తమ కమిటీ ఆమోదించిన సవరణలు ఈ బిల్లును మరింత సమర్థంగా, సమగ్రంగా తీర్చిదిద్దుతాయని చెప్పారు. ఈ బిల్లులోని 14 క్లాజులకు ఎన్డీయే ఎంపీలు ప్రతిపాదించిన సవరణలకు ఆమోదం లభించిందని తెలిపారు. ఈ బిల్లులోని అన్ని (44) క్లాజులకు విపక్ష సభ్యులు వందలాది సవరణలను ప్రతిపాదించారని, వాటిని ఓటింగ్ ద్వారా కమిటీ తిరస్కరించిందని చెప్పారు. అయితే దీనిపై ప్రతిపక్షాల ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జేపీసీ చైర్మన్ ప్రజాస్వామిక ప్రక్రియను తుంగలో తొక్కారని మండిపడ్డారు. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ విలేకర్లతో మాట్లాడుతూ, ఇదంతా ఓ ప్రహసనమన్నారు. తాము చెప్పిన దానిని చైర్మన్ వినలేదన్నారు. పాల్ నియంతృత్వ ధోరణితో వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జేపీసీలో మెజారిటీ అభిప్రాయానిదే పైచేయి అని పాల్ తెలిపారు. మతపరమైన కార్యకలాపాల కోసం ఉపయోగించడాన్ని బట్టి వక్ఫ్ అనే దాని ఆధారంగా ప్రస్తుత వక్ఫ్ ఆస్తులను ప్రశ్నించరాదని ప్రస్తుత బిల్లులో ఉంది. దీనిని కొత్త బిల్లులో తొలగించాలని జేపీసీ కీలక ప్రతిపాదన చేసింది. ఈ సవరణలతో కూడిన వక్ఫ్ సవరణ బిల్లుకు ఈ నెల 29న తుది రూపం ఇచ్చి, ఈ నెల 31న లోక్ సభకు సమర్పించనున్నట్లు సమాచారం.