Raju Parulekar | ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాల విషయంలో మోదీ ప్రవర్తించిన తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ ప్రారంభించే ముందు మోదీ అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులతో, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో వరుస చర్చలు జరిపారు. కానీ.. కాల్పుల విరమణ నిర్ణయాన్ని మాత్రం సొంతంగా తీసుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఖిలపక్షం నిర్వహించలేదు.. కనీసం విపక్షాలకు సమాచారం కూడా ఇవ్వలేదు. చివరికి అందుబాటులో ఉన్న మంత్రులతో క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించకుండా.. మోదీ పూర్తి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
పార్లమెంట్ సమావేశం నిర్వహించి దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని సర్వత్రా డిమాండ్లు వెల్లువెత్తుతుంటే.. మోదీ మాత్రం ఆదివారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించడంపైనా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తాను మాట్లాడాలనుకున్న విషయాలను మాత్రమే చెప్పి తప్పించుకోవడానికే వీడియో సందేశం ఇచ్చారని మండిపడుతున్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ జర్నలిస్టు, రచయిత, రాజకీయ విశ్లేషకుడు రాజు పార్లేకర్ ఏకంగా మోదీ ప్రసంగాన్ని ‘నాన్సెన్స్’గా అభివర్ణించారు. ‘ప్రధాని ఏకపక్షంగా టీవీల్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించడం పార్లమెంట్ సమావేశాలకు ప్రత్యామ్నాయం కాదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రతీసారి ఇలా తనకు నచ్చినట్టు ఏకపక్షంగా, స్వేచ్ఛగా మాట్లాడి తన బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. రాజ్యాంగ విరుద్ధమైన ప్రధాని వ్యవహారశైలిని ప్రతిపక్షం ఎండగట్టాలి.
పార్లమెంట్ సమావేశాలకు ప్రత్యామ్నాయంగా టీవీల్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించేంత ఎమర్జెన్సీ పరిస్థితులు ఇప్పుడు దేశంలో లేవు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(3) ప్రకారం.. లోక్‌సభకు మంత్రిమండలి సమష్టిగా బాధ్యత వహిస్తుంది. ప్రధాని మోదీ పార్లమెంట్‌కు జవాబుదారీగా ఉండాలి. పార్లమెంట్‌కు సమాధానం చెప్పాలి. ఆయన తనకు నచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడాలి. తన మనసులో గూడు కట్టుకున్న భావోద్వేగాలను పార్లమెంట్లో బయటపెట్టాలి. అవసరమైతే ఏడ్వవచ్చు కూడా. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రశ్నించేందుకు, అవసరమైతే సాయం చేసేందుకు ప్రతిపక్షం ఉంది. మనది ప్రజాస్వామ్యం, నిరంకుశత్వం కాదు. రాత్రి 8 గంటలకు జరిగే నాన్సెన్స్ను ఆపాలి’ అని రాజు పారులేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని వెంగుర్లాలో జన్మించిన రాజు.. సామ్నా, మహారాష్ట్ర టైమ్స్, లోక్‌సత్తా, మహానగర్, లోక్ప్రభ సహా అనేక పత్రికల్లో వ్యాసాలు రాశారు. పలు పుస్తకాలు కూడా రాశారు.