చమోలీ: ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత టూరిస్టు ప్రాంతం జోషీమఠ్ కుంగిపోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ పట్టణంపై భారత అంతరిక్ష సంస్థ ఓ కొత్త రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు.. అంటే 12 రోజుల్లోనే జోషీమఠ్ పట్టణం 5.4 సెంటీమీటర్ల మేర కుంగిపోయినట్లు ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తన రిపోర్ట్‌లో పేర్కొన్నది. దానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను కూడా రిలీజ్ చేసింది. కార్టోశాట్-2ఎస్ శాటిలైట్ ఈ చిత్రాలను తీసింది.
గత ఏడాది జనవరి 2వ తేదీన జోషీమఠ్ ప్రాంతంలో భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగిన నాటి నుంచి ఆ ప్రాంతంలో నేల కుంగిపోవడం ప్రారంభమైనట్లు అంచనా వేస్తున్నారు. జోషీమఠ్‌లో ఉన్న ఆర్మీ హెలిప్యాడ్, నార్సింగ్ ఆలయం వద్ద చాలా వేగంగా భూమి కుంగిపోయినట్లు తేల్చారు. జోషీమఠ్-ఔలీ రోడ్డు వద్ద 2180 మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు ఇస్రో తన రిపోర్ట్‌లో స్పష్టం చేసింది.
గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య జోషీమట్లో సింకింగ్ రేటు చాలా తక్కువగా ఉందని, ఆ సమయంలో అక్కడ 9 సెంటీమీటర్ల మేర భూమి కుంగిపోయినట్లు ఇస్రో తన నివేదికలో పేర్కొన్నది. జోషీమఠ్ పట్టణంలో ఉన్న సుమారు 700 బిల్డింగ్‌ల్లో క్రాక్స్ వచ్చినట్లు గుర్తించారు.